బెలూన్లతో చైనా సాగిస్తున్నగూఢచార కార్యకలాపాలు తెలిసి అమెరికా సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డ్రాగన్ కంట్రీ… 5 ఖండాలకు చెందిన దేశాల మీదుగా తన గూఢచార బెలూన్లను వదులుతోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ షాకింగ్ న్యూస్ చెప్పారు. తాము ఇటీవల ఓ బెలూన్ ను పేల్చివేశామని, దాని నుంచి సేకరించిన శకలాల తాలూకు డేటాను మిత్ర దేశాలకు అందజేస్తున్నామని ఆయన చెప్పారు. ‘ఇప్పటికే మేం వాషింగ్టన్ నుంచి, మా ఇతర ఎంబసీల ద్వారా ఈ సమాచారాన్ని ప్రపంచంలోని పలు దేశాలకు చేరవేశాం.. అంటే చైనా మా దేశాన్నే కాక, ఇతర దేశాలను కూడా తన టార్గెట్ చేసుకుందని స్పష్టమవుతోంది’ అన్నారు. ఇది 5 ఖండాలకు చెందిన ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని అతిక్రమించడమే అని ఆయన ఆరోపించారు.
నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బెర్గ్ తో కలిసి నిన్న వైట్ హౌస్ లో మాట్లాడిన ఆయన..తమ కూటమికి చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్ల గురించి కూలంకషంగా చర్చించామని తెలిపారు. ఆ దేశంతో తాము సామరస్య బంధాలనే కోరుకుంటున్నామని, తమ స్పందనను ఆ దేశాధ్యక్షుడు అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని బ్లింకెన్ చెప్పారు. జీ జిన్ పింగ్ కి ఈ బెలూన్ వ్యవహారం తెలుసా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన.. దీనికి ఎవరు బాధ్యులు అన్నది ముఖ్యం కాదని, చైనా తన బాధ్యతారహిత చర్యలతో అంతర్జాతీయ చట్టాలను ఎలా ఉల్లంఘిస్తున్నదనే విషయమే ప్రధానమని అన్నారు.
ఇక చైనా ప్రవర్తన ఇటీవలి బెలూన్ ద్వారా స్పష్టమైందని, చైనీస్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాల పట్ల అన్ని దేశాలూ అప్రమత్తంగా ఉండవలసి ఉందని నాటో అధినేత జెన్స్ వ్యాఖ్యానించారు. అణ్వస్త్రాలతో సహా ఆ దేశం తన సైనిక పాటవాన్ని పెంచుకుంటున్నదని, పైగా దీన్ని దాచుకోవడం లేదని ఆయన అన్నారు.
గతంలో కూడా చైనాకు చెందిన నాలుగు స్పై బెలూన్లు తమ దేశం మీదుగా ఎగిరాయని పెంటగాన్ వెల్లడించింది. అయితే అవి సైనిక స్థావరాల మీదుగా ఎగిరాయా అన్న అంశాన్ని వివరించలేదు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తన స్టేట్ ఆఫ్ యూనివర్స్ ప్రసంగంలో చైనాను తీవ్రంగా హెచ్చరించారు.