కరోనా వైరస్ ముమ్మాటికీ చైనాలోని వ్యూహాన్ ల్యాబ్‌లో తయారైనదేనని ఆ దేశానికి చెందిన వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పక్కా శాస్త్రీయ ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. కరోనా.. వ్యుహాన్ మాంసపు మార్కెట్ నుంచి వ్యాపించిన వైరస్ ఏ మాత్రం కాదని ఆమె స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేసినప్పటికీ.. ఎలాంటి స్పందన లేదన్నారు. కరోనా వైరస్ మనిషి నుంచి మనిషి నుంచి వ్యాపిస్తుందన్న విషయం చైనా ప్రభుత్వానికి ముందుగానే తెలుసు అని ఆమె చెప్పారు.
కరోనా వైరస్ జన్యుశ్రేణి మనిషి వేలిముద్రను పోలి ఉంటుందన్న ఆమె…. వైరాలజీ గురించి తెలిసినవారందరికి ఈ వైరస్ మానవ సృష్టేనని అర్థమవుతుందని తెలిపారు. ఏడాది కాలం నుంచి కరోనా వైరస్‌పై తాను పరిశోధన చేస్తున్నట్టు ఆమె చెప్పారు. కరోనా గురించి నిజాలు బయటపెట్టినందుకే.. తనను చంపేందుకు కుట్ర జరిగిందని.. అందుకే తాను చైనా నుంచి పారిపోయి వచ్చి అమెరికాలో తలదాచుకుంటున్నానని అన్నారు. తన గురించి తప్పుడు ప్రచారం చేయడాని, తాను చెప్పేదంతా అబద్ధమని నమ్మించడానికి ప్రభుత్వం కొందరిని ప్రత్యేకంగా నియమించుకుందని లి మెంగ్ యాన్ ఆరోపించారు.