టిబెటన్ల బౌద్ధ గురువు దలైలామాపై గూఢచర్యం నెరపుతున్నదనే అనుమానంపై చైనాకు చెందిన ఓ మహిళను బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. దలైలామా బుద్ధ గయకు వస్తున్న నేపథ్యంలో గురువారం ఇక్కడ హైఅలర్ట్ ప్రకటించారు. బీహార్ పోలీసులు ఉదయం నుంచే ఈ ప్రాంతంలో మోహరించారు. ఈ చైనా మహిళ కోసం వారు విస్తృతంగా గాలించారు. సాంగ్ జియాలోమ్ అనే ఈమెను బుద్ద గయలోని కాల్ చక్ర గ్రౌండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్రౌండ్ లోనే దలైలామా ఆధ్యాత్మిక ప్రసంగం చేయాల్సి ఉంది. అంటే ఆయన ఇక్కడికి చేరుకుంటారని ఈమె ముందే పసిగట్టినట్టు భావిస్తున్నారు.
భర్త నుంచి విడాకులు తీసుకున్న ఈమెకు ఇద్దరు పిల్లలని, 2019 లో ఇండియాకువచ్చి..తిరిగి చైనాకు వెళ్లిందని తెలుస్తోంది. అయితే మళ్ళీ ఇండియా చేరుకొని నేపాల్ వెళ్లి.. కొన్ని రోజులపాటు గడిపిందని, అక్కడి నుంచి బీహార్ లోని బుద్ధగయ వచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి. దలైలామాకు ముప్పు ఉన్నట్టు బెదిరింపులు అందడంతో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ .. సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది.
దీంతో బీహార్ పోలీసులు .. ఈమెను అరెస్టు చేయక ముందు ఈమె స్కెచ్ ను విడుదల చేశారు. దీంతో బాటు వారు సాంగ్ పాస్ పోర్ట్, వీసా వివరాలను మీడియాకు షేర్ చేశారు.ఆమె గురించి గత రెండేళ్లుగా తాము కొంత సమాచారం అందుకుంటున్నామని గయ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ హర్ ప్రీత్ కౌర్ తెలిపారు.
గయలో ఒక మహిళ కొన్ని రోజులుగా ఉంటున్నట్టు స్థానిక పోలీసులకు ‘ఇన్ పుట్స్’ అందాయని, వీటిని తాము పరిగణనలోకి తీసుకున్నామని ఆ అధికారి చెప్పారు. ప్రస్తుతం పోలీసులు సాంగ్ ను ప్రశ్నిస్తున్నారు. ఆమె గూఢచారి అన్న అనుమానాన్ని తోసిపుచ్చలేమని వీరు అంటున్నారు. బీహార్ లోని కొన్ని జిల్లాల్లో దలైలామా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయనున్న తరుణంలో ఆమె ఇక్కడికి చేరుకోవడం ఈ అనుమానాలకు ఊతమిస్తోంది.