ఎన్నికలకు రెడీ అవుతున్న తమిళ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకోనుంది. అక్రమాస్తుల కేసులో కర్ణాటక జైల్లో ఉన్న జయలలిత అంతరంగికురాలు శశికళ ఈ నెలాఖరులోపు విడుదలకానుంది. కోర్టు చెప్పినట్లుగా ఆమె ఫైన్ కూడా కట్టేశారు. ఇక ఆమె విడుదల ఖాయమే.
ఎన్నికలకు ముందు శశికళ రీఎంట్రీ చాలా కీలకం. సీఎంగా జయలలిత మరణించిన తర్వాత తన వర్గాన్ని కాపాడుకుంటూ… ఎమ్మెల్యేలను చేజారకుండా చూసుకొని పళనిస్వామిని సీఎం చేశారు. కానీ పళనిస్వామి బీజేపీతో చేతులు కలపటం, శశికళ-బీజేపీ మధ్య సయోధ్య కుదరకపోవటంతో రాజకీయాలు మారిపోయాయి. శశికళ జైలుకు వెళ్లారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. ఓవైపు రజనీకాంత్ రానని చేసిన ప్రకటన, మరోవైపు అన్నాడీఏంకే సరైన నాయకత్వం లేకపోవటంతో ఉన్న గ్యాప్ ను శశికళ ఫిల్ చేసే అవకాశం ఉంది. అయితే.. అన్నాడీఏంకేను తిరిగి తన వైపుకు తిప్పుకుంటారా…? వేరు కుంపటి పెట్టుకుంటారా…? అన్న చర్చ సాగుతుంది.
ఈసారి తమిళ రాజకీయాల్లో ఎలాగైన ఎంట్రీ ఇవ్వాలని పట్టుదలగా ఉన్న బీజేపీ… శశికళతో చేతులు కలుపుతుందన్న వాదన గట్టిగా వినపడుతుంది. తనపై ఇప్పటికే కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో బీజేపీతో ఆమె చేతులు కలిపే అవకాశం ఉందని, ఇది డీఏంకేకు ఎక్కువ ఇబ్బందికర పరిణామంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.