తుళ్ళూరులో రాజధాని ఉన్నంత కాలం జగన్ కూడా సక్సెస్ కాలేడట. ఎందుకంటే ఆ ప్రాంతం దళితుల రక్తంతో తడిసిందట. శపించబడిన ప్రాంతం కాబట్టే చంద్రబాబు కూడా ఓడిపోయాడట. ఈ మాటలు ఎవరో అన్నవి కావు, తిరుపతి నగరాన్ని రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అంటున్న మాటలు!
తిరుపతి : మహరాష్ట్ర ఎన్నికల తరువాత హైదరాబాద్‌ను యూనియన్ టెరిటరీ చేయబోతున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన ప్రకటన చేశారు. ‘ఇప్పటికే కాశ్మీరు ప్రభావం దేశం మీద ఏ రూపంలో ఉందో చూస్తున్నాం.. రాజ్యసభలో మెజారిటీ రాగానే హైదరాబాద్‌పై దృష్టిపెట్టబోతున్నారు..’ అని చింతా మోహన్ చెప్పారు. ‘తుళ్ళూరు శపించబడ్డ ప్రాంతం.. అక్కడ రాజదాని శ్రేయస్కరం కాదు’ అని చింతా మోహన్ అన్నారు. రాష్ట్ర రాజధాని తుళ్ళూరు దళితుల రక్తంతో తడిచింది. అక్కడ రాజధాని ఉన్నంత వరకూ జగన్మోహన్‌రెడ్డి రాణించలేరు. అక్కడ రాజధాని అంత శ్రేయస్కరం కాదు. చంద్రబాబు ఓటమికి రాజధాని అమరావతే ప్రధానకారణం. తుళ్ళూరు రాజధానిగా ఎన్నుకోవడం వలనే చంద్రబాబు కాలు జారిపడ్డారు. రాజధానికి తిరుపతి సరైన ప్రాంతం..’ అని చింతామోహన్ వ్యాఖ్యానించారు.