కోడి పందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్లుగా చూపించడం.. రాక్షస రాజకీయం అవసరంగా కనిపిస్తోందన్నారు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని.. ఈ దుర్మార్గపు నీచమైన ప్రచారం ఇకనైనా ఆపాలని స్పష్టం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. వీటికి బెట్టింగులు లక్షల్లో ఉండగా, పాల్గొన్నవారిలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ సహా పలువురు వీఐపీలు ఉన్నట్లు ప్రచారం సాగింది. శివారులోని పెద్దకంజర్ల గ్రామంలో కోడిపందాల సమాచారం తెలిసి పోలీసులు రెయిడ్ నిర్వహించగా, నిర్వాహకులు పందెరాయుళ్లు అక్కడి నుంచి పరారయ్యారు.
పోలీసులు ఓ 20 మందిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే భారీగా నగదు, పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. చింతమనేని ఖాకీలు రాగానే గుట్టుచప్పుడు కాకుండా పరారైనట్టు వార్తలు వచ్చాయి. పరారైన పందెరాయుళ్లు, నిర్వాహకులను పట్టుకోవటానికి, పటాన్ చెరువు డీఎస్పీ భీంరెడ్డి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి.
చింతమనేని టీడీపీ నేత కావడంతో వైసీపీ వర్గాలు తిట్లదండకం అందుకున్నాయి. సోషల్ మీడియాలో ఆయన్ను ట్రోల్ చేస్తూ రకరకాల పోస్టులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే చింతమనేని స్పందించారు. తనపై నీచమైన ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటి ఆనాడు అధికారంలోకి వచ్చారని.. ఆ మేడ కూలిపోయే సమయం ఆసన్నమయిందని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైసీపీ అసత్యాల మీడియాను ప్రజలు కూకటివేళ్లతో ప్రక్షాళన చేస్తారని స్పష్టం చేశారు. ఆరోజు కొసమే తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారన్న చింతమనేని.. ఈ రాక్షస రాజకీయ వికట ఆట్టహాసానికి ముగింపు త్వరలోనే అంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు.