చిరంజీవి, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది? పవన్ కల్యాణ్, మహేష్ బాబు కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది? ప్రభాస్-మహేష్ కాంబోలో మల్టీస్టారర్ వస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఫాంటసీలు ప్రేక్షకుల్లో చాలానే ఉంటాయి. అయితే ఆ కాంబినేషన్ ను భరించేంత సత్తా టాలీవుడ్ కు ఉందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్.
మహేష్, పవన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో అందరికీ తెలుసు. అక్కడే వంద కోట్ల రూపాయలకు పైగా పోతాయి. ఇక స్టార్ డైరక్టర్ తో పాటు ఇతర నటీనటుల రెమ్యూనరేషన్లకు మరో 75 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ప్రొడక్షన్ కాస్ట్ మరో 200 కోట్ల రూపాయలు అవుతుంది.
ఒకప్పుడు తెలుగు మార్కెట్ నుంచి ఇంత రాబట్టుకోవడం చాలా కష్టమైన వ్యవహారం. అందుకే మల్టీస్టారర్ల దిశగా ఎవ్వరూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ పెరిగింది. దేశవిదేశాల్లో తెలుగు సినిమాలు ఆడుతున్నాయి. కాబట్టి ఇలాంటి టైమ్ లో ఫాంటసీ కాంబినేషన్లు తెరపైకొస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు చిరంజీవి.
“నేను, పవన్ కల్యాణ్ కలిసి సినిమా చేస్తే చూడాలని చాలామందికి ఉంది. నాక్కూడా ఉంది. పైగా ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ కూడా పెరిగింది. కాబట్టి రెవెన్యూ గురించి బెంగలేదు. ఎవరైనా మంచి కథ, కాంబినేషన్ తో వస్తే తప్పకుండా పవన్ తో సినిమా చేస్తా.”
రాబోయే రోజుల్లో మరిన్ని మల్టీస్టారర్లు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు చిరంజీవి. తాజాగా వచ్చిన గాడ్ ఫాదర్ లో సల్మాన్ లో, అంతకంటే ముందొచ్చిన ఆచార్యలో రామ్ చరణ్ తో, పండక్కి రాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరు.