చిరంజీవి-బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ వార్ అనేది ఓ చరిత్ర. దశాబ్దాలుగా ఈ స్టార్ హీరోల మధ్య ఇది జరుగుతూనే ఉంది. అయితే.. ఈమధ్య కాలంలో తమ సినిమాల విడుదల విషయంలో గ్యాప్స్ ఇస్తున్నారు ఈ ఇద్దరు సీనియర్లు. అయితే.. ఇప్పుడు మరోసారి చిరు-బాలయ్య మధ్య బాక్సాఫీస్ వార్ తప్పేలా లేదు. వాళ్ల సినిమాలు ఒకే టైమ్ లో రిలీజ్ అవుతున్నాయి.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ ఆఖరి వారంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. సరిగ్గా అదే టైమ్ కు చిరంజీవి మూవీ కూడా విడుదలకానుంది.
మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేశారు చిరంజీవి. ఈ సినిమాను సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 28న బాలయ్య చిత్రం, 30న చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతానికైతే మేకర్స్ ఇద్దరూ ఈ తేదీలకే ఫిక్స్ అయ్యారంట. బాలయ్య అయితే ముహూర్తం తీసి మరీ, శుక్రవారం కాకపోయినా 28వ తేదీని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి ఆ తేదీ నుంచి ఆ టీమ్ వెనక్కి తగ్గకపోవచ్చు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది చిరంజీవి మాత్రమే. అసలే థియేట్రికల్ వ్యవస్థ అయోమయంగా ఉంది. ఇలాంటి టైమ్ లో లేనిపోని పోటీలకు పోయి, మార్కెట్ ను నాశనం చేసుకోవాలని ఎవరూ అనుకోరు. కాబట్టి ఈ రెండు సినిమాల్లో ఒకటి కచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే గాడ్ ఫాదర్ కు సంబంధించి రిలీజ్ డేట్ రానుంది.