విలక్షణ నటుడు కమల్ హాసన్ ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. విక్రమ్ సినిమా అద్భుత విజయం సాధించడంతో హైదరాబాద్ లో సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కమల్ హాసన్ ను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించి సన్మానించారు.
ఈ సన్మాన కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే మెగా కుటుంబానికి చెందిన హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ సైతం ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ వేడుకలో విక్రమ్ సినిమాను తెలుగులో విడుదల చేసిన హీరో నితిన్ పాల్గొన్నాడు. ఈ విషయాలను మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం కమల్ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా విజయాన్ని అభినందిస్తూ తన మిత్రుడు కమల్ హాసన్ ను సన్మానించడం ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు.
విక్రమ్ ఒక అద్భుతమైన సినిమా అని ప్రశంసించారు చిరు. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మలయాళీ రీమేక్ గా సిద్ధమవుతున్న ‘గాడ్‌ఫాదర్’లో నటిస్తున్నారు. దీనికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.