హైదరాబాద్ యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, విప్లవ కవి, రచయిత గద్దర్, సినీ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
సినీ పరిశ్రమ కోసం ఎంతో మంది తమ కుటుంబాలను త్యాగం చేశారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఎన్నో బాధలను దిగమింగుకుని సినిమా కోసం పనిచేస్తారని పేర్కొన్నారు. సినీ కార్మికుల జీవితాలకు భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ కార్మికులు చేసుకుంటున్న మేడే పండుగకు తనను ఆహ్వానించిన ఫెడరేషన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తానూ కార్మికుడినేనని.. ఎవరికి ఏ కష్టమొచ్చినా వారి వెనకే ఉంటానని భరోసా కల్పించారు చిరంజీవి.
తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపు వెనుక కార్మికుల కృషి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా 5 కోట్ల మంది మాత్రమే సంఘటిత రంగంలో ఉంటే.. 45 కోట్ల మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ సైతం తెలుగు సినిమా ప్రాధాన్యతను ప్రశంసించారని పేర్కొన్నారు. కరోనా వల్ల పర్యాటక, సినీ రంగాలు చాలా నష్టపోయాయన్న కిషన్ రెడ్డి.. వ్యాక్సిన్ రావడం వల్ల పర్యాటక, సినీ రంగాలు నిలదొక్కుకున్నాయని చెప్పారు.
Advertisements
కరోనా వల్ల షూటింగ్‌లు జరగక సినీకార్మికులకు తీరని నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి.చిరంజీవి తన అభిమాన హీరో అని.. ఆయన ఆంధ్రా వాడు కాదని.. తెలంగాణలో ఉన్న సినిమా బిడ్డలంతా తెలంగాణ వాళ్లేనని పేర్కొన్నారు మల్లారెడ్డి. సినీ ఇండస్ట్రీకి చిరంజీవి పెద్ద దిక్కుగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి సినీ కార్మికులదన్న ఆయన.. కరోనా సమయంలో వారు చాలా ఇబ్బందిపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు తలసాని.