సూపర్‌స్టార్లు రజనీకాంత్, చిరంజీవి, కమలహాసన్ ఫాన్స్ ఫాలోయింగ్‌లో మామూలోళ్లు కాదు క్రేజీ స్టార్స్‌గా సక్సెస్ అయ్యారు. సినీరంగంలో ఎదురు లేదన్న స్థాయికి చేరి శభాష్ అనిపించుకున్నారు. ముగ్గురూ ఒకరికొకరుగా కలిసి ఉంటూ భావాలు పంచుకుంటారు. అందుకే చిరంజీవి వారి శ్రేయోభిలాషిగా ‘పాలిటిక్స్ మనకొద్దు బాసూ’ అంటూ సలహా ఇచ్చి వుండవచ్చు.. ఓకే !
ఈ ఉచిత సలహానే ఇప్పుడు ఉపద్రవం తెచ్చిపెడుతోంది. చిరంజీవీ లేటెస్ట్ కామెంట్స్‌పై రచ్చ మొదలయ్యింది. చిరంజీవి మాటలు రజ్నీ, కమల్‌కే వర్తిస్తాయా..? లేక తన సొంత తమ్ముడి పవన్‌కల్యాణ్ క్కూడా వర్తిస్తాయా… అని కొంతమంది నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. లేదు.. ఇది తన తమిళ ఫ్రెండ్స్‌కే అనుకుంటే మరి ఇదే సలహా ఇంట్లో తన సొంత తమ్ముడి పవన్‌కల్యాణ్ క్కూడా ఇవ్వొచ్చుకదా.. అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు.
ఇంకోవైపు చిరంజీవి వ్యాఖ్య జనసైనికులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టి జనంలో తిరుగుతున్న తమ జన సేనానికి ఇండైరెక్టుగా మెగాస్టార్ ఇలాంటి సలహాలు ఇవ్వడం వారికి నచ్చడం లేదు. పైగా ఆమధ్య ఇంటికి పిలిపించుకుని పాలిటిక్స్ పార్టు టైమ్‌గా తీసుకుని ఒకటీ రెండు సినిమాలు చేయవచ్చు కదా అని తమ్ముడికి అన్నయ్య సలహా ఇచ్చాడనే వార్త రావడంతో అసలే జన సైనికులు గుర్రు మీదున్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు మాసాల్లోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుందని, ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టడంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విఫలమవుతున్న నేపథ్యంలో జన సేనాని ఒక్కరే జనంలో తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారని, ఈ దశలో మెగాస్టార్ ఇలాంటి పుల్లవిరుపు మాటలు మాట్లాడ్డం బాలేదని జన సైనికుల అభిప్రాయంగా వుంది. వారు వచ్చే జమిలీ ఎన్నికల తరువాత తమ నాయకుణ్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రబలంగా కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో పాలిటిక్స్ వద్దు.. అంటూ ఉచిత సలహాలు ఇవ్వడం ఏం సబబు అని నిలదీస్తున్నారు.
ఇలావుంటే ప్రజారాజ్యం జెండా ఎత్తేసి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్‌లో కలిపేసి కొన్నాళ్లు కేంద్ర మంత్రి హోదాలో గడిపేసి తర్వాత పార్టీ పరాజయం పాలయ్యాక మళ్లీ సిన్మాల్లో సెకండ్ ఎంట్రి ఇచ్చిన చిరంజీవి రాజకీయాలపై అంత హేళనగా మాట్లాడటం ఇటు రాజకీయ వర్గాల్లో కూడా మంట లేపుతోంది. సగంలో వదిలేసిన పొలిటికల్ కెరియర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలకమైన మలుపు తిరగడానికి కారణమైన చిరంజీవి.. రాజకీయాల్లో అన్నీ అనుభవించి ఇలా మాట్లాడ్డం బాలేదని పలు పార్టీల నేతలు అంటున్నారు. కేంద్ర మంత్రి పదవిలో కూడా పనిచేశారని, రాష్ట్ర విభజన జరుగుతుంటే రాజీనామా కూడా చేయకుండా, పైగా కేంద్ర మంత్రి పదవి పోయినా కూడా ఢిల్లీలో అధికార నివాసం చాన్నాళ్లు ఖాళీ చేయకుండా అంటిపెట్టుకున్న వ్యక్తి రాజకీయాల గురించి ఇలా అవహేళన చేస్తూ మాట్లాడ్డం సమంజసంగా వుందా అని అడుగుతున్నారు. పాలిటిక్స్‌లో చిరంజీవి నష్టపోయిందేంటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ పెట్టారు.. టిక్కెట్లిచ్చి దండుకున్నారు.. కేంద్ర మంత్రి పదవి కూడా వెలగబెట్టారు.. మళ్లీ వెండితెర పిలుస్తోందంటూ సిన్మారంగం వైపు వచ్చేశారు.. ఇంకేంటి..? అని పరిశీలకుల వ్యాఖ్య.