సౌత్ డాన్సింగ్ స్టార్స్ లో ఒకరు చిరంజీవి. ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే ది బెస్ట్ డాన్సర్లలో ఒకరు. హృతిక్, అమీర్, గోవింద లాంటి బాలీవుడ్ స్టార్స్ సైతం డ్యాన్స్ విషయంలో తమకు చిరంజీవి ఆదర్శం అంటుంటారు. టాలీవుడ్ విషయానికొస్తే చిరంజీవి ట్రెండ్ సెట్టర్.
ఇక సల్మాన్ ఖాన్ విషయానికొద్దాం. డ్యాన్స్ అంటే అస్సలు పడని వ్యక్తి. ఆయనకు డ్యాన్స్ కంపోజ్ చేయడం అంటే కొరివితో తలగోక్కున్నట్టే ఉంటుంది. కొరియోగ్రాఫర్ ఏదో చెబుతాడు, సల్మాన్ ఇంకేదో స్టెప్ వేస్తాడు. అదే స్టయిల్, అదే ట్రెండ్ అంటారు సల్మాన్ అభిమానులు. మ్యాగ్జిమమ్ కాళ్లు, చేతులు ఊపడంతోనే సల్మాన్ డ్యాన్స్ పూర్తవుతుంది. ఈ సంగతి పక్కనపెడితే, మ్యూజిక్ తో సంబంధం లేకుండా తనకు తోచిన డ్యాన్స్ చేసుకుంటూ పోవడం సల్మాన్ లో ఉన్న మరో స్పెషాలిటీ.
డ్యాన్సింగ్ స్టార్ చిరంజీవి, డ్యాన్స్ అంటే తెలియని సల్మాన్ ఇప్పుడు కలిశారు. ఇద్దరూ కలిసి ఓ పాటకు చిందేస్తున్నారు. ఆ అరుదైన ఘటనకు గాడ్ ఫాదర్ వేదికగా నిలిచింది. ఈ సినిమాలో సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కీలక పాత్ర పోషించడంతో పాటు ఓ పాటలో చిరంజీవితో కలిసి డ్యాన్స్ కూడా చేస్తున్నాడు కండలవీరుడు.
ఇప్పుడీ సాంగ్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరు-సల్మాన్ పై షూట్ చేస్తున్నారు. ఈ పాట ఎలా ఉంటుందో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.