ప్రీ-లుక్ చూసి బాబి సినిమాలో చిరంజీవి మాస్ గెటప్ లో కనిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా కేవలం మాస్ లుక్స్ వరకు మాత్రమే ఆగిపోలేదు. ఇందులో అదిరిపోయే యాక్షన్ కూడా ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో 6 పెద్ద ఫైట్లు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో అత్యంత కీలకమైన ఫైట్ ను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు.
చిరంజీవి-బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మన్ నేతృత్వంలో ఈ సినిమాకు సంబంధించి చిరంజీవిపై భారీ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.
చిరంజీవి చేస్తున్న ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం అతడు చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ఓ రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళాశంకర్ సినిమా కూడా రీమేక్ సినిమానే. బాబి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా మాత్రమే స్ట్రయిట్ తెలుగు మూవీ. ఇంకా చెప్పాలంటే ఆచార్య తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న ఫ్రెష్ సబ్జెక్ట్ ఇది.
ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది. ఆమె ఇంకా సెట్స్ పైకి రాలేదు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ నిర్మాతలుగా ఈ సినిమా వస్తోంది. చిరంజీవి ఆప్తుల్లో ఒకడైన జీకే మోహన్ ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.