ఇప్పుడు సైరాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిజ వారసుల నుంచి కొత్త చిక్కులు వచ్చేలా కనిపిస్తోంది. సినిమా కథ విషయంలో సైరా టీమ్ పెద్దగా పరిశోధనలేవీ చేయకుండా అప్పుడెప్పుడో పరుచూరి బ్రదర్స్ అల్లిన కథని తీసుకుని దానికి మరి కొందరు రచయితలు అందించిన వివరాలను జోడిస్తూ సినిమా చేశారనేది ఒక వాదన. సైరా సినిమాలో పెద్దగా నరసింహారెడ్డి నిజ జీవిత విశేషాలు లేవంటున్నారు. 250 కోట్లకు పైగా భారీ బడ్జెట్ వెచ్చిస్తుండడంతో పాటు, చిరంజీవి వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో చేస్తున్న సినిమా కాబట్టి, ఒక పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో సైరా తెరకెక్కిస్తే తమ వంశ పరువు ప్రతిష్టలు ఏంగానూ అంటున్నారు నరసింహారెడ్డి వారసులు.
తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన తండ్రి చిరంజీవి హీరోగా, నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి ప్రముఖ నటీనటులతో నిర్మిస్తున్న చరిత్రాత్మక చిత్రం ‘సైరా’. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది.
ఇలావుంటే, నరసింహారెడ్డి నాలుగవ, ఐదవ తరం వారసులకు, సైరా నిర్మాతలకు మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఇద్దరి మధ్య మీడియేటర్‌గా వ్యవహరించిన ఒక నిర్మాత, మేనేజర్ ఆ వారసుల పట్ల చిన్నచూపు ప్రదర్శించి వారిని అవమానించి పంపడమే కాకుండా నిర్మాత చరణ్, హీరో చిరంజీవిలకు అసలు నిజాలు చేరవేయలేదనేది వారి వాదన. ఇప్పుడు ఈ సినిమా కథ గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వస్తుండడంతో ఈ వివాదం సరికొత్త మలుపు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
తమ వంశం మూలపురుషుడైన నరసింహారెడ్డి గురించి అవాస్తవాలతో కూడిన కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పించి ఈ సినిమా తీశారనేది వారి వాదన. అందుకే సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని, అందులో తమకు అభ్యంతరాలున్నా, తమ వంశ మూల పురుషుడిని కించపరిచేలా ఉన్నా ఊరుకోబోమని అంటున్నారు. తమకు చూపించి ఓకే చేశాకనే సెన్సార్ వారు ఈ సినిమాకు సర్టిఫికెట్ జారీ చేయాలని వారి డిమాండ్. అలాకాకుండా తమ ఇష్టానుసారం సినిమా తీసేసి విడుదల చేసేస్తే చూస్తూ ఊరుకునేది లేదని అంటున్నారట.
ఒక్కసారి సినిమా కానీ విడుదలయిపోతే, ఆ తర్వాత నరసింహారెడ్డి వ్యక్తిత్వానికి జరిగే నష్టం ఎవ్వరూ పూడ్చలేరు కాబట్టి, తమ కోరిక ప్రకారమే జరగాలని వీరు కోరుకుంటున్నారు. అంత భారీ బడ్జెట్ వెచ్చించి సైరా సినిమాను నిర్మిస్తున్న రామ్ చరణ్, చిరంజీవి ఈ విషయంలో నిర్లక్ష్యం చెయ్యడం మంచి పద్ధతి కాదని సినిమా పరిశ్రమకు చెందిన పలువురు పెద్దల అభిప్రాయం. మధ్యవర్తుల మాటలు నమ్మి ఆ వీరుడి నిజమైన వారసుల మాటలను పెడచెవిన పెట్టడం వారి స్టేటస్‌కే మాయని మచ్చలా మిగిలిపోతుందని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
అందుకే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులను చర్చలకు ఆహ్వానించి సమస్యను పరిష్కరించుకోవడమే అందరికీ మంచిదని సలహా ఇస్తున్నారు. ఇప్పటికే సినిమా విడుదలకు సంబంధించి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కొన్నవారి పరిస్థితి గురించి కూడా ఆలోచన చెయ్యాలనేది వీరి అభిప్రాయం. చూద్దాం.. మరి మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. !