చిరంజీవి తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషిస్తున్న భారీ చారిత్రాత్మక చిత్రం “సైరా” నిర్మాణానంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. వినాయకచవితి శుభాకాంక్షలు చెబుతూ, వివిధ భాషలలో తీసున్న సైరా మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు.
త్వరితగతిన అన్నీ పూర్తి చేసుకుని, అవసరమైన ప్రమోషన్స్ కంప్లీట్ చేసుకుని ముందుగా ప్రకటించినట్టే గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన విడుదలకు సిద్ధమైపోతోంది. ఇప్పటికే టాలీవుడ్ సినిమాల్లో అక్టోబర్ మొదటివారం విడుదల అనుకున్న కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ‘సైరా’ ప్రభంజనానికి ఎదురెళ్ళడం ఎందుకూ అని ఆయా సినిమాల నిర్మాతలు తమ విడుదల తేదీలను మార్చుకున్నారు.
అయితే ఓ రెండు టాలీవుడ్ సినిమాలు సైరా సినిమాతో పాటుగా తమ సినిమాలను కూడా విడుదల చేసి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్టు సమాచారం. ఇటీవలి కాళంలో వరుసగా ఫ్లాప్స్ వచ్చి, సక్సెస్ కోసం ఆత్రంగా వేచి చూస్తున్న మినిమం గ్యారెంటీ హీరో గోపీచంద్ తాజా చిత్రం “చాణక్య” ఇందులో ఒకటి. తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో వస్తున్న చాణక్య సినిమాలో గోపీచంద్ జోడీగా మెహ్రీన్ నటిస్తోంది. అలాగే బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ మరో ముఖ్యపాత్రలో కనిపించబోతోంది. శర్వానంద్ “పడి పడి లేచె మనసు” ఫేం విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఒక్క సాంగ్ చిత్రీకరణ మినహా మొత్తం పూర్తయినట్లు సమాచారం. హై ఓల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న “చాణక్య” విజయావకాశాలపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు హీరో గోపీచంద్. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే చాణక్య సినిమా అక్టోబర్ 4న విడుదలవుతుందని సమాచారం.
మరోవైపు బుల్లితెర స్టార్ యాంకర్ నుంచి వెండితెర దర్శకుడిగా ఎదిగిన ఓంకార్ కూడా ఈ రేసులో నిలుస్తున్నట్టు సమాచారం. తన రాజు గారి గది సిరీస్‌లో భాగంగా వస్తున్న “రాజు గారి గది – 3” సినిమా అక్టోబర్ మొదటివారంలో విడుదల చెయ్యాలన్నది తన ప్లాన్. మరి అనుకున్నట్టుగానే సైరా విడుదల సమయంలోనే ఈ రెండు చిత్రాలు థియేటర్స్‌లోకి వస్తాయా లేక వాయిదా పడతాయా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. బాలీవుడ్‌లో సైతం అక్టోబర్ 2నే సైరా విడుదల కాబోతుంది. అయితే అక్కడా ఒకింత భారీ ఫైట్ ఉండవచ్చు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ సినిమా “వార్”తో చిరు “సైరా” పోటీపడాల్సి రావచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో!