ఆచార్య సినిమా ఇలా రిలీజైన వెంటనే అలా విదేశాలకు వెళ్లిపోయారు చిరంజీవి. ఆ సినిమా నష్టాలు, డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించాల్సిన మొత్తాలు, వాళ్లకు ఇవ్వాల్సిన హామీలు.. ఇలా అన్నింటినీ రామ్ చరణే దగ్గరుండి చూసుకున్నారు. ఆ సినిమా తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇన్ని రోజులకు మళ్లీ చిరంజీవి, తన విదేశీ పర్యటన ముగించుకొని ఇండియాకు వచ్చారు.
అయితే.. ఇక్కడ మేటర్ ఆచార్య గురించి కాదు. ఆయన చేయాల్సిన ఓ సినిమాపై ఈమధ్య కాలంలో చాలా ప్రచారం జరిగింది. ఆ సినిమా ఆగిపోయిందంటూ కథనాలు కూడా వచ్చాయి. అదే చిరు-వెంకీ కుడుముల సినిమా.
దానయ్య నిర్మాతగా వెంకీ దర్శకత్వంలో చిరంజీవి ఓ కామెడీ ఎంటర్ టైనర్ చేయాల్సి ఉంది. ఆచార్య ఫ్లాప్ తో వెంకీ కుడుములతో చేయాల్సిన సినిమాపై చిరంజీవి వెనక్కి తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించడానికి అటు దర్శకుడు, ఇటు నిర్మాత ముందుకురాలేదు. చిరంజీవి విదేశాలకు వెళ్లిపోయారు.
సాధారణంగా చిరంజీవి సినిమాలపై క్లారిటీ ఇవ్వాలంటే ఆయన మాత్రమే ఇవ్వాలి. మరో వ్యక్తి ఆ పని చేయడానికి వీల్లేదు. అందుకే దర్శకనిర్మాతలు ఆ పని చేయలేదు. ఇప్పుడు చిరంజీవి, విదేశీ పర్యటన ముగించుకొని ఇంటికి తిరిగి రావడంతో.. వెంకీ కుడుముల సినిమాపై ఓ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంతా భావిస్తున్నారు.