సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు సినిమా ఎడిటర్ గౌతంరాజు (68) కన్నుమూశారు. దీంతో ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, పెద్దలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తూ.. గౌతంరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. తాజాగా చిరంజీవి ఎమోషనల్ నోట్ ను పంచుకున్నారు.
గౌతం రాజు మృతిపట్ల చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమలో గొప్ప ఎడిటర్‌ను కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఆయన ఎంత సౌమ్యుడో, ఆయన ఎడిటింగ్ అంత వాడి అంటూ ప్రశంసించారు. అంతేకాకుండా ఆయన మితభాషి, కానీ ఎడిటింగ్ మెళకువలు అపరిమితం అంటూ చిరు కొనియాడారు.
గౌతంరాజు సినిమా రంగానికి చేసిన సేవలను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. చట్టానికి కళ్ళు లేవు చిత్రం నుంచి ఖైదీ నం 150 వరకూ తన ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా గౌతంరాజు పనిచేశాడని తెలిపిన మెగాస్టార్.. ఆయన లేకపోవటం వ్యక్తిగతంగా తనకు, మొత్తం పరిశ్రమకి పెద్దలోటన్నారు. గౌతంరాజు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నానంటూ ఏమోషనల్ అయ్యారు చిరంజీవి.
ఇక గౌతంరాజు దాదాపుగా 850 సినిమాల వరకు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేసి తన మార్క్ చూపించేవారు. తెలుగులో సూపర్ హిట్ చిత్రాలైన చిరంజీవి ఖైదీ నెంబర్ 150, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ రేసుగుర్రం, బలుపు, బద్రీనాథ్, డాన్ శీను, వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన పనిచేశారు. ఆయన కిడ్నీ, శ్వాస సంబంధ సమస్యలతో మరణించినట్లు తెలుస్తోంది. గౌతంరాజు మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి