లెక్కప్రకారం చిరంజీవి, పూరి కాంబినేషన్ లో సినిమా ఈపాటికి రావాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. చిరంజీవి కోసం ఆటోజానీ అనే సబ్జెక్ట్ రాశాడు పూరి జగన్నాధ్. దర్శకుడి నెరేషన్ కూడా చిరంజీవికి బాగా నచ్చింది. అయితే పూరి చెప్పిన సెకండాఫ్ చిరుకు నచ్చలేదు. అక్కడే గొడవ మొదలైంది.
పూరి చెప్పిన సెకెండాఫ్ తనకు నచ్చలేదని చిరంజీవి మీడియా ముందు అనేశారు. అదేదో తనకు చెబితే మార్చేవాడిని కదా, తనకు చెప్పకుండా మీడియాకు చెప్పడం ఏంటని పూరి హర్ట్ అయ్యాడు. అలా ఆటోజానీ సబ్జెక్ట్ పక్కకెళ్లిపోయింది.
ఇప్పుడు మరోసారి చిరు-పూరి కలిశారు. చిరు నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు పూరి జగన్నాధ్. సినిమా హిట్టయింది. దీంతో ప్రమోషన్లలో పూరికి కూడా భాగం కల్పించారు. చిరు-పూరి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పూరి డైరక్షన్ లో నటించే అంశంపై చిరు స్పందించారు.
ఆటోజానీ సబ్జెక్ట్ ఉందా పక్కనపడేశావా అని ప్రశ్నించారు చిరు. దానికి సమాధానంగా ఆ స్క్రిప్ట్ ను పక్కన పడేశానని, అడిగితే మరో మంచి కథ రెడీ చేస్తానని పూరి సమాధానమిచ్చారు. పూరి డైరక్షన్ లో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, బహుశా, మరో మంచి సినిమా చేసేందుకే, ఆటోజానీ ప్రాజెక్టు పక్కకెళ్లిపోయిందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు చిరు.
చిరు వ్యాఖ్యలతో మెగాస్టార్-పూరి కాంబినేషన్ పై మరోసారి స్పెక్యులేషన్ మొదలైంది. ఈసారి ఎలాగైనా చిరంజీవి, పూరి కాంబోలో సినిమా రావడం ఖాయం అంటున్నారు నెటిజన్లు.