చిరంజీవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారనేది దాదాపు ఫిక్స్. అధికారిక ప్రకటన ఒక్కటే ఆలస్యం. అయితే ఈ క్రమంలో మరో దర్శకుడికి చిరంజీవి హ్యాండ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.
గతంలో డీవీవీ నిర్మాతగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేసేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానికి సంబంధించి అప్పట్లో అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడు ఇదే బ్యానర్ పై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేసేందుకు చిరంజీవి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే దీనర్థం, వెంకీ కుడుములతో సినిమా లేనట్టే.
నిజానికి చిరు-వెంకీ కుడుముల సినిమా ఆగిపోయినట్టు చాన్నాళ్ల కిందటే వార్తలొచ్చాయి. ఎప్పుడైతే ఆచార్య సినిమా డిజాస్టర్ అయిందో, ఆ వెంటనే తన ప్రాజెక్టులపై చిరంజీవి సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా వెంకీ కుడుముల సినిమాను ఆయన పక్కనపెట్టినట్టు వార్తలొచ్చాయి.
ఇప్పుడు ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ, డీవీవీ బ్యానర్ పై త్రినాధరావు నక్కినతో సినిమా అంటూ లీకులు వస్తున్నాయి. త్వరలోనే ఈ అంశంపై స్పష్టత వచ్చేలా ఉంది.