నల్గొండ జిల్లా నకిరేకల్ లో హోలీ వేడుకల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హోలీ వేడుకల సందర్భంగా అధికార బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. హోలీని పురస్కరించుకొని నకిరేకల్ లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గాలు పోటాపోటీగా సంబరాలు నిర్వహించారు.
ఎవరికి వారే తమ అనుచరగణంతో నకిరేకల్ పట్టణ సెంటర్లోకి రావడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. నకిరేకల్ చౌరస్తాకు ఇరు వర్గీయులు చేరుకొని బల ప్రదర్శనకు దిగారు. హోరాహోరీగా నినాదాలు చేశారు. వేముల వీరేశం వర్గీయులు తమను హోలీ సంబరాలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని చిరుమర్తి వర్గీయులు ఆందోళన చేపట్టారు. వీరేశం వర్గానికి డీజేలకు పర్మిషన్ ఇచ్చి తమ వర్గానికి డీజే పర్మిషన్ ఇవ్వకుండా పోలీసులు వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ సమయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రెండు వర్గాలని అక్కడి నుంచి పంపించారు. అయితే ఈ నియోజకవర్గంలో గతకొద్ది కాలంగా చిరుమర్తి, వీరేశం మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. అనేక సందర్భాల్లో వీరిద్దరి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.
ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిరుమర్తి లింగయ్య,బీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం పై విజయం సాధించారు. ఆ తర్వాత చిరుమర్తి బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి నియోజక వర్గంలో అధికార బీఆర్ఎస్ లో చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశం గ్రూప్ లు కొనసాగుతున్నాయి.