జమ్మికుంట బీఆర్ఎస్ సభ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కేటీఆర్ సభకు వచ్చిన ఓ యువకున్ని బీఆర్ఎస్ కార్యకర్తలు చితక బాదారు. సదరు యువకుడు బీజేపీ పార్టీకి చెందిన టీ షర్ట్ వేసుకొని వచ్చాడన్న కారణంగా దాడికి పాల్పడ్డారు.
దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు యువకున్ని అక్కడి నుంచి పంపించారు. మరోవైపు మంత్రి కేటీఆర్ ను నిరసనకారులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. పోలీసులు అప్రమత్తమై ముందస్తు అరెస్టు చేసినా కేటీఆర్ కు నిరసన సెగ తప్పలేదు. కమలాపూర్ లో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను ఎన్ ఎస్ యూ ఐ నేతలు అడ్డుకున్నారు. నల్ల చొక్కాలు ధరించి..నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు.
ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. మరో వైపు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకారుల చొక్కాలు చింపి వారిపై దాడికి పాల్పడ్డారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
అయితే బీజేపీ టీ షర్టు వేసుకున్నంత మాత్రాన వ్యక్తి పై దాడి చేయడం చాలా దుర్మార్గమని బీజేపీ మండిపడుతుంది. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అందుకే కేసీఆర్ ఇంకా కేటీఆర్ కు అడుగడుగునా నిరసన సెగ తగులుతుందన్నారు.