బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి కోపంతో ఊగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ని (కరువు భత్యాన్ని) పెంచేది లేదని ప్రకటించారు. వీరికి డీఏ పెంచడానికి ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేవని, ఇప్పటికే అదనంగా మూడు శాతం పెంచామని ఆమె అన్నారు. కేంద్ర ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర సిబ్బందికి కూడా కరువు భత్యాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ విపక్ష బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు చేస్తున్న నిరసనలపై ఆమె తీవ్ర ఆగహం వ్యక్తం చేస్తూ.. ‘ నా తల నైనా మీరు నరకవచ్చు.. కానీ ప్రభుత్వం వద్ద నిధులు లేవు.. ఇంకెన్ని నిధులు ఇవ్వాలి’ అని ప్రశ్నించారు.
గత ఫిబ్రవరి 15 న అసెంబ్లీకి బడ్జెట్ సమర్పించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య .. ప్రభుత్వం టీచర్లు, పింఛన్ దారులతో సహా రాష్ట్ర ఉద్యోగులకు 3 శాతం అదనపు డీఏని మార్చి నుంచి చెల్లిస్తుందని ప్రకటించారు. కానీ కేంద్ర ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలన్న విపక్షాల ఆందోళన అర్థరహితమని మమతా బెనర్జీ అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వేతన స్కేళ్లలో వ్యత్యాసాలు ఉంటాయని, ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీలు కలిసి నిరసనలు చేయడం ఏమిటన్నారు. . ఉద్యోగులకు వేతనంతో కూడిన అనేక సెలవురోజుల సౌకర్యం కల్పిస్తూ ఏ ప్రభుత్వం వెసులుబాటును కల్పిస్తుందని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ సిబ్బందికి 1.79 లక్షల కోట్లను డీఏను తమ ప్రభుత్వం చెల్లిస్తోందని, వేతనంతో కూడిన 40 సెలవు రోజులు ఉన్నాయని, అలాంటప్పుడు కేంద్ర ఉద్యోగులతో ఎందుకు పోల్చుకుంటున్నారని ఆమె అన్నారు.
వంట గ్యాస్ ధరలు పెరిగాయి.. ఎన్నికలు అయిపోగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.. ఈ పరిస్థితుల్లో ఈ ప్రజలను సంతృప్తి పరచేందుకు ఇంకేం చర్యలు తీసుకోవాలి అని మమత పేర్కొన్నారు.