కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు లోక్ సభలో కలకలం రేపాయి. ఇరు పార్టీల సభ్యులు ఒకరినొకరు కొట్టుకునేందుకు దూసుకు వచ్చారు. కాంగ్రెస్ సభ్యులు నా సీటు దగ్గరకు వచ్చి నా చేతిలో ఉన్న కాగితాలు లాక్కునేందుకు ప్రయత్నించారని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ హర్షవర్ధన్ ఆరోపణలను తోసిపుచ్చారు. బీజేపీ సభ్యులే కాంగ్రెస్ సభ్యులను తోసేశారని చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మెడికల్ కాలేజీల విషయమై ఆరోగ్య మంత్రిని ఓ ప్రశ్న అడిగారు. దానికి సమాధానం ఇవ్వాల్సిన మంత్రి సమాధానం ఇవ్వకుండా ఢిల్లీ ఎన్నికల ర్యాలీలో ప్రధాన మంత్రిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించే వాక్యాలను చదువుతుండడంతో గొడవ మొదలైంది.
”సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మి…ప్రియతమ రాహుల్ గాంధీకి సమాధానం ఇచ్చే ముందు..ప్రధాన మంత్రిపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అన్నారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా సమాధానానికే పరిమితం కావాలని కోరినప్పటికీ హర్షవర్ధన్ చెప్పుకుంటూ పోయారు. దీనికి ఆగ్రహించిన కాంగ్రెస్ సభ్యులు హర్షవర్ధన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఒక్కసారిగా స్పీకర్ చైర్ చుట్టు చేరారు. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ సభ్యులు మానిక్కం ఠాగోర్ అధికార పక్ష సభ్యుల వైపు వెళ్లి రెండో వరుసలో ఉన్న మంత్రి హర్షవర్ధన్ పై అరిచారు. ఇది జరుగుతుండగా బీజేపీ ఎంపీలు కొందరు ఆయన్ను వెనక నుంచి పట్టుకున్నారు. ఇదంతా జరుగుతుండగానే హర్షవర్ధన్ చదువుకుంటూ పోతున్నారు. ” చే మయినే కే బాద్..ఇస్ దేశ్ కా యువ…నరేంద్ర మోదీ కో దండే మార్ మార్ కే దేశ్ సే బహర్ కరేంగే (ఆరు నెలల తర్వాత ఈ దేశంలోని యువత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కర్రలతో కొట్టి దేశం నుంచి వెళ్లగొడ్తుంది)” అన్నారు. వాళ్ల నాయన ఒక ప్రధాన మంత్రి. మన పార్టీ నేతలు ఎవరు ఇలాంటి మాటలు అనడం నేను ఎన్నడూ చూడలేదన్నారు. కర్రతో కొట్టడం అనే మాటలు సభ అంతా ఖండించాలని కోరారు. దీనిపై తరచుగా సభా కార్యక్రమాలకు ఆటంకం కలగడంతో స్పీకర్ ఓం బిర్లా సభను సోమవారానికి వాయిదా వేశారు.