న్యూజిలాండ్ నూతన ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జనరల్ సిండీ కైరో ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టే విషయంలో హిప్కిన్స్‌కు పార్టీ నుంచి భారీ మద్దతు లభించింది. ఇది తన జీవితంలో అతి పెద్ద బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
తన ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను ఉత్సాహంగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ఇటీవల మాజీ ప్రధాని జెసిండా ఆర్డ్నెన్ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేశారు. దేశానికి నాయకత్వం వహించే సత్తా తనకు లేదంటూ ఆమె పేర్కొన్నారు.
ఈ క్రమంలో నూతన ప్రధానిగా హిప్కిన్స్ బాధ్యతలు స్వీకరించారు. కొవిడ్ సంక్షోభ సమయంలో మంత్రిగా హిప్కిన్స్ పనిచేశారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని దేశాన్ని ముందుకు నడిపించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలంటే హిప్కిన్స్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం… లేబర్ పార్టీకి పాపులారిటీ తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆయన కేబినెట్ తొలి సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నట్టు సమాచారం.