న్యూజిలాండ్ తదుపరి ప్రధాని ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చింది. ప్రధానిగా మాజీ మంత్రి క్రిస్ హిప్‌కిన్స్ ఎన్నిక దాదాపు ఖరారయింది. ఇప్పటికే అధికార లేబర్ పార్టీ నాయకుని ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అధ్యక్ష పదవికి కేవలం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక లాంఛనమే.
తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రస్తుత ప్రధాని జెసిండా ఆర్డెన్ ఇటీవల ప్రకటన చేశారు. దీంతో పార్టీ నాయకున్ని ఎన్నిక ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో ఆ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. ఆయన నామినేషన్‌కు ఈ నెల 22న జరుగనున్న సమావేశంలో పార్టీ ఎంపీలు మద్దతు తెలపాల్సి ఉంటుంది.
ఒకే నామినేషన్ రావడంతో తదుపరి ప్రధానిగా హిప్‌కిన్స్(44) ఎన్నికైనట్లు లేబర్ పార్టీ ప్రకటించింది. దీంతో త్వరలో ఆయన దేశ 41వ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ఆయన సారథ్యం వహించనున్నారు.
దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో క్రిస్ హిప్‌కిన్స్ కొవిడ్ రెస్పాన్స్ మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన నేతృత్వంలో మహమ్మారిని కట్టడి చేయగలిగారు. తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రధాని జెసిండా ఆర్డెన్ ఇటీవల ప్రకటించారు.
ఫిబ్రవరి 7న ఆమె రాజీనామా చేయనున్నారు. అధికార పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తన రాజీనామాకు ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్టు తెలిపారు.