ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కొత్త కొత్త వేరియంట్ల ద్వారా వ్యాపిస్తూ జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహమ్మారిని అదుపు చేసే ఔషధం వ్యాక్సిన్ అని చెబుతున్నారు నిపుణులు. అయినా కూడా చాలా దేశాల్లో టీకా ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో టీకాపై అవగాహన కల్పిస్తూ బ్రెజిలోని రియో డీ జనీరోలో ఆరోగ్య కార్యకర్తలు వినూత్న ప్రయత్నం చేశారు.
ఖాళీ కోవిడ్ -19, ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ల వైల్స్ తో క్రిస్మస్ చెట్టును రూపొందించారు. రంగురంగుల ఈ క్రిస్మస్ ట్రీ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీని ఏర్పాటు వెనుక ఉద్దేశం దేశంలో టీకాల గురించి హైలైట్ చేయడం, అవగాహన కల్పించడమని చెబుతున్నారు.
బ్రెజిల్ లో 6,15,000 కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. డిసెంబర్ 10 నాటికి కరోనా మరణాల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బ్రెజిల్ లోని జనాభాలో 65 శాతం మంది పూర్తి టీకాను పొందారు. దీంతో మరణాల సంఖ్య క్రమంగా తగ్గింది.