ఏదైనా చోరీ చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. మరి పోలీసే చోరీ చేస్తే.. చాలా అరుదుగా వెలుగులోకి వచ్చే ఇలాంటి సంఘటన మన హైదరాబాద్ లోనే చోటు చేసుకుంది. అరెస్ట్ అయి జైలులో ఉన్న నిందితుడి అకౌంట్ నుంచి రూ.5లక్షలు దొబ్బేశాడు ఓ సీఐ. రాచకొండ పరిధిలో జరిగిన ఈ వ్యవహారంపై కమిషనర్ అంతర్గత విచారణకు ఆదేశించారు.
కొన్ని రోజుల క్రితం బేగంబజార్ కు చెందిన టైర్ల కంపెనీ యజమాని కమల్ కబ్రా ను ఓ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాత అతడ్ని జైలుకు పంపారు. ఆ సమయంలో కమల్ డెబిట్ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరిలో ఇదంతా జరిగింది.
కమల్ బెయిల్ పై బయటకి వచ్చాక.. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయం అయ్యాయని గుర్తించాడు. బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించగా ఏటీఎం ద్వారా డ్రా అయినట్లు తెలిసింది. జైలులో ఉన్నప్పుడే అకౌంట్ నుంచి రూ.5 లక్షల వరకు డబ్బులు డ్రా అయ్యాయని నిర్ధారించుకుని ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనలో సీఐ దేవేందర్ పై అనుమానాలు ఉన్నాయి. ఆయన గర్ల్ ఫ్రెండ్ తిరుపతి ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసినట్లు సమాచారం. సీపీ మహేష్ భగవత్ అంతర్గత విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది.