ఎట్టకేలకు మాజీ సీఐ నాగేశ్వరరావుపై వేటు పడింది. అతడ్ని సర్వీస్ నుండి తొలగించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. నాగేశ్వరరావుపై వివాహితను బెదిరించి అత్యాచారం చేసిన కేసు ఉంది. ఈమధ్యే కండిషన్ బెయిల్ పై విడుదలయ్యాడు. పోలీస్ శాఖకే మాయని మచ్చ తెచ్చిన ఇతనిపై చర్యలు తీసుకోకపోతే చిక్కులు తప్పవని భావించిన సీపీ సీవీ ఆనంద్.. సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
జూలై 7న హైదరాబాద్ హస్తినాపురంలో తన దగ్గర పని చేసే వివాహిత ఇంటికి వెళ్లి గన్ గురి పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తపై కూడా దాడికి పాల్పడ్డాడు. తర్వాత వారిద్దరినీ కారులో ఎక్కించి తీసుకెళ్తుండగా.. ఇబ్రహీంపట్నం సమీపంలో ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు తప్పించుకుని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు పొందుపరిచారు. బాధితురాలి భర్త ఇంట్లో ఉన్నాడా అనే విషయాన్ని తెలుసుకొనేందుకు మొబైల్ ట్రాకింగ్ టెక్నాలజీని నాగేశ్వరరావు ఉపయోగించాడు. బాధితురాలి భర్త ఇంట్లో లేని విషయాన్ని గుర్తించి అక్కడకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో అరెస్టైన నాగేశ్వరరావు బెయిల్ కోసం తెగ ప్రయత్నించాడు. రెండు దఫాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
కోర్టు ఇతనికి బెయిల్ నిరాకరిస్తూ వచ్చింది. అయితే, సెప్టెంబర్ 28న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయాల పూచీకత్తు ఇవ్వాలని ఆదేశించింది. అప్పటి నుంచి బెయిల్ పై బయట ఉన్న నాగేశ్వరరావును తాజాగా పోలీస్ సర్వీస్ నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. ఇతనికి అధికారపార్టీకి చెందిన కీలక నేతలతో సంబంధాలున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో విమర్శించారు. అంతేకాదు, అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి.