ఎన్నికల ముందు వీఆర్ ఏలకు జీతాలు పెంచి, పదోన్నతులు కల్పిస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేశారని రెండు రోజుల నుంచి వీఆర్ ఏల జేఏసీ పిలుపు మేరకు శాంతియుత నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జేఏసీ నాయకుల తో పాటు వీఆర్ ఏలు శాంతియుత నిరసన తెలియజేస్తున్నారు. కాగా అక్కడికి వచ్చిన టౌన్ సీఐ సతీశ్ నిరసన చేస్తున్న నాయకులను పరుష పదజాలంతో దుయ్యబట్టారు.
వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
అంతేకాకుండా మీ వల్ల శాంతి భద్రత సమస్యలు తలెత్తుతే.. పై అధికారులు కాల్చమని ఆదేశాలు ఇస్తే అందరిని కాల్చి పారేస్తా అంటూ రెచ్చిపోయారు.
శాంతియుతంగా నిరసన చేపట్టిన వారి పట్ల సీఐ అలా ప్రవర్తించడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేస్తారా అంటూ జేఏసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎవరికి ఏ ఆటంకం కలగకుండా మేము చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎటువంటి రభస జరగలేదని అయినప్పటికీ సీఐ ప్రవర్తన చాలా దారుణంగా ఉందని జేఏసీ నాయకులు అన్నారు.
వెంటనే సీఐ మీద తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.