విశాఖ శారదా పీఠం దగ్గర హైడ్రామా నడిచింది. మంత్రి సీదిరి అప్పలరాజు, పోలీసుల మధ్య వాగ్వాదం నడిచింది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అనుచరులతో కలిసి శారదా పీఠానికి వచ్చిన మంత్రిని గేట్ దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. మంత్రికి మాత్రమే ఎంట్రీ ఉందని అనుచరులను అనుమతించమని చెప్పారు.
అప్పలరాజు మాట్లాడుతుండగానే సీఐ.. మీరు ఒక్కరే వెళ్లాలని లేకుంటే లేదని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో తనతో దురుసుగా ప్రవర్తించారని మంత్రి నిరసనకు దిగారు. సీఐ అసభ్య పదజాలంతో మాట్లాడారని ఆరోపించారు. తనకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని హోంమంత్రి సుచరిత దగ్గర తేల్చుకుంటానని అన్నారు అప్పలరాజు. సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. కొద్దిసేపు గేటు దగ్గరే ఉండి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయి. సీఎం జగన్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.