హైదరాబాద్ లోని మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో అక్కడ..నారాయణ భూములు అక్రమంగా కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే ఆయన కుమార్తె ఇంట్లో సీఐడీ సోదాలకు దిగింది.
హైదరాబాద్ లోని కూకట్ పల్లి, కొండాపూర్, గచ్చిబౌలిలోని ఆమె ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే గతంలో నెల్లూరులోని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ ఇంట్లో కూడా అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి సీఐడీ సోదాలు నిర్వహించింది. గేటు వేసి మరీ ఎవరినీ లోపలికి రానీయకుండా ఈ సోదాలు కొనసాగించడం అప్పట్లో ఎన్నో అనుమానాలకు దారితీసింది.
అమరావతిలో అసైన్ట్ భూములు కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి మూడు సంవత్సరాల క్రితమే సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో సీఐడీ ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది.
అమరావతిలో 1100 ఎకరాల అసైన్డ్ భూములలో అక్రమాలు జరిగాయని సీఐడీ అభియోగం మోపింది. అదే ప్రాంతంలోని వేర్వేరు గ్రామాల్లో 89.9 ఎకరాల అసైన్డ్ భూములను కొన్నారని పేర్కొంది. ఇలా వేర్వరు సర్వే నెంబర్లలోని అసైన్డ్ భూములు మాజీ మంత్రి నారాయణ, ఆయన బంధువులు, తెలిసినవారి పేర్లతో కొనుగోలు చేశారని ఆరోపించారు.