ఆథ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు, సినీ నటుడు చిరంజీవిని ఉద్దేశించి ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై రోజురోజుకి వివాదం పెద్దదవుతోంది. గరికపాటి వారి వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విటర్ వేదికగా స్పందించారు. అయితే ఎక్కడ కూడా ఆయన పేరును మాత్రం ప్రస్తావించలేదు.
ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటేనని స్పందించారు. దీనిపై బ్రహ్మణ సంఘాలు స్పందించాయి. నాగబాబు వ్యాఖ్యలకు ఆలిండియా బ్రహ్మణ ఫేడరేషన్ ఉపాధ్యాక్షులు ద్రోణంరాజు రవికుమార్ కౌంటర్ ఇచ్చారు. ఆహార్యానికి.. అవధానానికి తేడా తెలియని మాయారంగం, నిత్యమూ తన ప్రవచనాలతో సమాజాన్ని సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాదికి, సమాజంతో నటనా వ్యాపారం తప్ప సమాజహితాన్ని మరచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందాడనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే అంటూ కౌంటర్ ఇచ్చారు.
చిడతలు కొట్టే వాడు కూడా సంగీత విద్వాంసులమని ట్వీట్లలో కూనిరాగాలాపన చేస్తే ఎలా అంటూ పేరు ప్రస్తావించకుండానే ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ ఘటనపై చిరంజీవి అభిమానులు సైతం స్పందిస్తున్నారు. చిరంజీవికి గరికపాటి నరసింహరావు తక్షణమే క్షమాపణలు చెప్పాలని లేకుంటే గరికపాటి నరసింహరావు ప్రవచనాలను అడ్డుకుంటామని రాష్ట్ర చిరంజీవి యువత తెలిపింది.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అక్టోబర్6వ తేదీ గురువారం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలో దసరా పండుగను పురస్కరించుకుని విజయదశమి తర్వాత రోజు బంధుమిత్రులను కలుసుకున్న సందర్భంగా పరస్పర ఆత్మీయాభిమానాలతో ఆలింగనం చేసుకుంటూ అలయ్ బలయ్ చెప్పుకుంటారు.
తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా ఈ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా.. బీజేపీలో ఉన్నసమయంలో బండారు దత్తాత్రేయ నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన గవర్నర్ హోదాలో ఉండటంతో ఆయన వాసరత్వంగా వారి కుమార్తె విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.