థియేటర్లలో సినిమా చూడడం అనేది, కల్యాణమండపంలో పెళ్లి చేయడం లాంటిది. ఈ మాట మేం చెప్పడం లేదు. హీరో కిరణ్ అబ్బవరం చెబుతున్నాడు. తమ సినిమాను థియేటర్లలో చూడాలని వేడుకుంటున్నాడు.
“సినిమా తీయడం ఒక ఛాలెంజ్ అయితే ప్రేక్షకులని థియేటర్ కి రప్పించడం మరో ఛాలెంజ్ గా మారిన పరిస్థితి నెలకొంది. థియేటర్స్ ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. టీవీలో ఓటీటీలో సినిమా చూడొచ్చు కానీ.. థియేటర్ లో చూడటంలో ఓ ఆనందం ఉంటుంది. పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు ఉంటే చాలు. అలా అని ఇంట్లో పెళ్లి చేయం. కళ్యాణ మండపం బుక్ చేసి అందరినీ పిలిచి వైభవంగా పెళ్లి చేసుకుంటాం. అందులో ఒక ఆనందం ఉంటుంది. సినిమాని థియేటర్లో చూడటంలో కూడా అలాంటి ఆనందమే ఉంది” అని అంటున్నాడు కిరణ్.
సమ్మతమే సినిమాను థియేటర్లలోనే చూడమంటున్నాడు ఈ హీరో. ఇందులో ఒక్కటి కూడా ఇబ్బంది పెట్టే సన్నివేశం ఉండదని, టికెట్లు బుక్ చేసుకొని, కుటుంబంతో కలిసి హాయిగా థియేటర్ కు వచ్చి చూడమని కోరుతున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఓ పాయింట్ చెప్పారట. థియేటర్స్ నుంచి బయటకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరు దాని గురించే ఆలోచిస్తారని చెబుతున్నాడు అబ్బవరం.
ఈ సినిమాకు సంబంధించి థియేటర్ల విషయంలో కిరణ్ అబ్బవరం టెన్షన్ పడడం లేదు. ఎందుకంటే, ఈ మూవీకి అల్లు అరవింద్, బన్నీ వాస్ సపోర్ట్ అందిస్తున్నారు.