చైనాలో కరోనా వైరస్ గురించి వాస్తవాలను వెల్లడించే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ప్రకటనల కంటే కూడా అక్కడున్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు వెల్లడిస్తున్న ఇద్దరు సిటిజన్ జర్నలిస్టుల్లో ఒకరు కనిపించకుండా పోయారు. మరొకరిని ప్రభుత్వ అధికారులు పిలిపించి కొంత సేపు నిర్బంధించారు. అక్కడ ఏమి జరిగిందో ఏమో కానీ అతను ఇంటికొచ్చాక మౌనంగా ఉంటున్నారు. అతను మౌనంగా ఉండడం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని ప్రభుత్వం ఏదో చేసిందని ఆరోపిస్తున్నారు.
ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత చైనాలో ఏం జరుగుతుందో ప్రభుత్వ అధికారిక ప్రకటనల కంటే కూడా చెన్ కిషీ, ఫంగ్ బిన్ అనే ఇద్దరు సిటిజన్ జర్నలిస్ట్స్ చెప్పే వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. వారిద్దరు చైనాలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. వుహాన్ లో జరగుతున్న దారుణ వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేసేవారు. వారు చెప్పేదానికి కోసం ప్రపంచమంతా ఎదురు చూసేది. వుహాన్ లో దారుణాలను తాను చూసినది చూసినట్టుగా రిపోర్ట్ చేస్తున్న చెన్ కిషీ నాలుగు రోజులుగా కనిపించడం లేదు. కుటుంబసభ్యులకు, మిత్రులకు ఎవరికీ అందుబాటులో లేడు. పోలీసులు తమకేమి తెలియదని అన్నారు. దీంతో చెన్ తల్లిదండ్రులు తన కుమారుడి జాడ కనుగొనాలని ప్రజలకు విజ్ఙప్తి చేశారు.
చెన్ సోషల్ మీడియా విబో అకౌంట్ లో ఉన్న 7,40,000 ఫాలోవర్స్ , గతంలో పోస్ట్ చేసిన వీడియోలన్నీ డిలెట్ అయ్యాయి. అతని సొంత చానెల్ కు 4,33000 మంది సబ్ స్క్రైబర్లు, ట్విట్టర్ అకౌంట్ లో 2,46000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. రెండింటిని ప్రభుత్వం బ్లాక్ చేసింది.
చెన్ మిస్సింగ్ కావడంతో అతన్ని క్వరైంటైన్ ( వైరస్ పరీక్షించే వార్డుల్లో )లో నిర్బంధించి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అతను ఎక్కడున్నాడనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు దృవీకరించ లేదు.
చెన్ మిస్సింగ్ కావడంపై ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని ముందుగా హెచ్చరించిన వుహాన్ డాక్టర్ లీ వెంగ్ లియాంగ్ మృతిపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఇప్పుడు చెన్ మిస్సింగ్ తో ప్రభుత్వం పై మండిపడుతున్నారు. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ”వుయ్ వాంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్” యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో నినదిస్తున్నారు.