అందరి దృష్టి ఇప్పుడు రాజ్యసభ పైనే ఉంది. పౌరసత్వం బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంతో ఈరోజు రాజ్యసభలో ఆమోదం పొందడమే మిగిలింది. మధ్యాహ్నం 12 గంటలకు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీ కి తగిన మెజార్టీ లేకపోయినప్పటికీ భావసారూప్యం గల కొన్ని పార్టీల మద్దతుతో బిల్లు గట్టెక్కుతుందని బీజేపీ ధీమాగా ఉంది.లోక్ సభలో ఎన్డీఏ సభ్యులు ఎక్కువ మంది ఉండడంతో కావాల్సిన మెజార్టీ కంటే ఎక్కువ మంది మద్దతే లభించింది. మొత్తం 311 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా…80 మంది మాత్రమే వ్యతిరేకించారు. కానీ రాజ్యసభలో పరిస్థితి వేరు. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 240. బిల్లు పాస్ కావాలంటే 121 మంది ఎంపీల మద్దతు కావాలి. ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలైన ఏఐఏడీఎంకే, జనతాదళ్(యు), అకాళీదల్ పార్టీలను కలుపుకుంటే మొత్తం 116 సభ్యులుంటారు. మరో 14 మంది ఇతర పార్టీల వారు మద్దతు పలికితే మెజార్టీ 130 అవుతుందని…బిల్లు పాస్ కావడం సులభమని బీజేపీ లెక్కలేస్తుంది.
బిల్లును వ్యతిరేకించే విపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ బిల్లు విషయంలో విపక్షాలు పాకిస్థాన్ భాష మాట్లాడుతున్నాయని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా చేయలేని పనిని తాము ఆరు నెలల్లో చేశామని చెప్పారు. పౌరసత్వం బిల్లు చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాయదగిందన్నారు.మత విచారణకు భయపడి పారిపోయిన వారికి తాము ఎంతో ఉపశమనం కల్గించామని చెప్పారు.