పౌరసత్వ చట్టంతో భారతీయ ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని ఢిల్లీ జమా మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ఉంటుందని..అయితే నిరసనకారులు సంయమనం పాటించాని కోరారు.పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న దశలో చట్టం వల్ల ముస్లింలకు నష్టం లేదని బుఖారీ అన్నారు. అంతే కాకుండా ఎన్.ఆర్.సి(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్) ఇంకా చట్టం కాలేదని గుర్తు చేశారు.
భారతదేశంలో నిరసనలు వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య హక్కు అని..దాన్ని ఎవరూ ఆపలేరని..అయితే నిరసనలు నియంత్రణలో ఉండాలని అన్నారు. మన భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడం అన్నింటి కంటే ముఖ్యమని షాహీ ఇమామ్ బుఖారీ గుర్తు చేశారు. దీనికి సంబంధించి వీడియోను ఓ మీడియా ఏజెన్సీ పోస్ట్ చేసింది.
సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్, ఎన్.ఆర్.సి కి ఉన్న తేడాను బుఖారీ వివరించారు. పౌరసత్వ చట్టం వల్ల పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి వచ్చిన ముస్లిం శరణార్దులకు పౌరసత్వం లభించదని…ఇండియాలోని ముస్లింలకు మాత్రం దీని వల్ల ఎలాంటి నష్టం లేదన్నారు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్ధులపై పోలీసుల హింసాత్మక అణిచివేత అనంతరం దేశంలోని ప్రముఖ జమా మసీద్ ముఖ్య మత బోధకుడైన షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ నిరసనకారులు సంయమనం పాటించాలని కోరడం గమనార్హం.