సుప్రీం కోర్టులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓ పిటిషన్ విచారణ సమయంలో సీజేఐ డీవై చంద్రచూడ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ‘మీరు నన్ను బెదిరించొద్దు. ముందు కోర్టు నుంచి బయటకు వెళ్లండి’అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టుకు కేటాయించిన భూమిని న్యాయవాదుల ఛాంబర్స్ కోసం ఉపయోగించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ పై విచారణ జరపాలంటూ సీజేఐని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కోరారు.
ఈ కేసు విచారణకు రావాలని తాము ఆరు నెలలుగా చాలా కష్టపడుతున్నామని వికాస్ సింగ్ అన్నారు. ఈ పిటిషన్ విషయంలో తనను కూడా ఓ సాధారణ కక్షిదారునిగా పరిగణించండని సీజేఐని ఆయన కోరారు. దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిటిషన్ పై విచారణకు ఇలా డిమాండ్ చేయడం సరికాదన్నారు. తాము రోజంతా ఖాళీగా కూర్చుంటున్నామని మీరు అనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. దీనిపై వికాస్ బదులిస్తూ… తాను అలా అనుకోవడం లేదన్నారు. తాను కేవలం కేసును విచారణకు చేపట్టేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అలా కుదరనప్పుడు మీ ఇంటికే రావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ప్రధాన న్యాయమూర్తిని బెదిరించాలని చూడవద్దంటూ వికాస్ సింగ్ కు సీజేఐ సూచించారు. తాను ప్రధాన న్యాయమూర్తినని, గత 22 ఏళ్లుగా ఇక్కడ ఉన్నానన్నారు. బార్‌లోని ఒక సభ్యుడు, పిటిషనర్ లేదా మరెవరికీ తాను ఏనాడూ బెదిరించే అవకాశం ఇవ్వలేదన్నారు.
తన చివరి రెండేండ్లు కూడా ఆ అవకాశం ఇవ్వనన్నారు. మీకు ఇష్టం లేని పనిని తాను చేసే పరిస్థితి తీసుకు రావద్దన్నారు. ఈ వ్యవహారం తర్వాత సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ఎన్ కే కౌల్ ఇతరులు బార్ అసోసియేషన్ తరఫున ప్రధాన న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.