సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అమరావతి భూముల విషయంలో చేసిన ఈ ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం ఇన్-హౌస్ విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు బుధవారం ప్రకటన విడుదల చేసింది.
అమరావతి భూముల విషయంలో జస్టిస్ ఎన్వీ రమణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబరు 6న సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్-హౌస్ ప్రొసీజర్‌లో విచారణ జరిపి, తగిన విధంగా పరిశీలించామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ఇన్-హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనది, ఈ వివరాలు బహిరంగంగా వెల్లడించదగినవి కాదని పేర్కొంది.
ఏప్రిల్ 23న భారత ప్రధాన న్యాయమూర్తి బోబ్డే పదవీ విరమణ చేయబోతున్నారు. తన తర్వాత చీఫ్ జస్టిస్ ఎవరు అన్నది సిఫార్సు చేయాలని కేంద్ర న్యాయశాఖ జస్టిస్ బోబ్డేను కోరగా… ఆయన జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను న్యాయశాఖ… హోంశాఖకు పంపి, కేంద్ర పరిశీలన తర్వాత రాష్ట్రపతికి సిఫార్సు చేయనుంది.
జస్టిస్ ఎన్వీ రమణపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని సుప్రీం తేల్చిన నేపథ్యంలో… జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐ కావటానికి అడ్డంకి కూడా తొలగినట్లయింది.