ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయ కమిషనర్ హరి జవహర్ లాల్, ఆలయ కార్యనిర్వహణాధికారి డీ భ్రమరాంబ కలిసి సీజేఐకి స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ చంద్రచూడ్ ఆలయంలో కనకదుర్గ అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత సీజేఐని వేదపండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. జస్టిస్ చంద్రచూడ్ తో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణ్ రావు, ప్రోటోకాల్ రిజిస్ట్రార్ రాఘవస్వామి, ఆర్థిక శాఖ ట్రైబ్యునల్ ఛైర్మన్ కేవీఎల్ హరనాథ్ గుప్తా, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆ తర్వాత జస్టిస్ చంద్రచూడ్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఖాజాలో ఏపీ జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని తెలిపారు. తదనుగుణంగా మార్పులు చేసుకోవాలని సూచించారు.
కోర్టులు వివాదాల పరిష్కారానికే కాదు.. న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలని అన్నారు. జడ్జిలు కేసుల సంఖ్య కంటే తీర్పుల నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని సీజేఐ అన్నారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలని వెల్లడించారు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.