తెలుగుభాష కోసం ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఏర్పడడం బాధగా ఉందన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. తెలుగు కమ్యూనిటీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, శివమాల దంపతులు పాల్గొన్నారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండతో కార్యక్రమం ప్రారంభమైందని.. తెలుగుతల్లి ముద్దుబిడ్డగా ఉన్న వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు జస్టిస్.
అమెరికాలో దాదాపు ఏడు లక్షల మంది తెలుగువారు ఉన్నారని వివరించారు. ఎన్నో దశలలో అనేక పరీక్షలు ఎదుర్కొని ముందుకు సాగుతున్నారని కొనియాడారు. తెలుగు అనేది కేవలం భాష కాదు.. జీవనవిధానం నాగరికత అని వ్యాఖ్యానించారు రమణ. మన భాషతో పాటు పరాయి భాషను గౌరవిస్తున్నామని.. అది తెలుగు జాతి గొప్పతనం అని పేర్కొన్నారు.
మాతృభాష, మాతృమూర్తిని పూజించడం ఒక ప్రత్యేకత అని చెప్పారు. అమ్మ భాషలోని తీయదనం అనుభవించాల్సిందేనని వివరించారు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేమన్నారు. ఇంట్లో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాతృభాషలోనే మాట్లాడాలన్నారు సీజేఐ. మన బాషా, సంస్కృతి మరిచిపోతే.. తెలుగు జాతి అంతరించి పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా ఉందన్నారు సీజేఐ. పుట్టిన ఊరు, మట్టి వాసన గుబాళింపును నెమరువేసుకోవాలన్నారు రమణ. మాతృభాషలో ఉద్యోగాలు రావనేది అపోహ మాత్రమేనన్నారు. తాను మాతృభాషలో చదివే ఈ స్థాయికి వచ్చాననేది మరచిపోవద్దని గుర్తుచేశారు రమణ. జాషువా, దాశరథి, శ్రీశ్రీ వంటి మహానుభావులు వెలకట్టలేని సంపద ఇచ్చారని కొనియాడారు. తెలుగు సంస్కృతిని, కళారంగాన్ని ప్రభావితం చేసిన ఎన్టీఆర్ శతజయంతి ప్రారంభమైందని పేర్కొన్నారు.