ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుతో వివాదాలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ ట్రస్టు డీడ్ రిజిస్ట్రేషన్ కు ఆయన హాజరయ్యారు. చీఫ్ జస్టిస్ తోపాటు సుప్రీంకోర్టు జడ్జీలు లావు నాగేశ్వరరావు, సుభాష్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు సీజే హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.
ఇంటర్నేషనల్ కంపెనీలు ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్, దుబాయ్ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అన్నారు ఎన్వీ రమణ. అయితే ఈ కేంద్రం ఏర్పాటుతో కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని చెప్పారు. అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు వస్తారని త్వరగా ఈ కేంద్ర కార్యకలాపాలు జరగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు తన కల అని చెప్పిన ఎన్వీ రమణ.. ప్రతిపాదించిన మూడు నెలల్లోనే అడుగులు పడడంపై సంతోషం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి వేదికగా ఆర్బిట్రేషన్ కేంద్రం ఉంటుందన్న సీజేఐ.. పీవీ హయాంలో ఆర్థిక సంస్కరణలు జరిగాయని గుర్తు చేశారు. అప్పుడే ఆర్బిట్రేషన్ చట్టం రూపుదిద్దుకుందని తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారు ఇబ్బందులు పడుతుంటారని.. ఈ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల వివాదాలు పరిష్కారం అవుతాయని చెప్పుకొచ్చారు. పరిశ్రమలకు దీనిపై అవగాహన కల్పించాలని కోరారు ఎన్వీ రమణ.