ఈనెల 26తో దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందనున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తర్వాతి ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కోరింది. దీంతో తదుపరి చీఫ్ జస్టిస్ గా ఉదయ్ ఉమేశ్ లలిత్ పేరును ఎన్వీ రమణ సిఫారసు చేశారు.
పదవీ విరమణ చేసే సీజేఐ తన వారసునిగా సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి పేరును సూచించడం సంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగా సీనియారిటీ లిస్టులో రమణ తర్వాత లలిత్ ఉన్నారు. అందుకే ఆయన పేరును సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఎన్వీ రమణ.
రికమండేషన్ లెటర్ ను కూడా జస్టిస్ లలిత్ కు సీజేఐ అందజేశారు. చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ పదవీకాలం 26న ముగియనుంది. ఆ తర్వాత జస్టిస్ లలిత్ బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే, చాలా తక్కువ కాలమే ఈయన పదవిలో ఉండనున్నారు.
లలిత్ నవంబర్ 8న రిటైర్ అవుతారు. పదవీ కాలం మూడు నెలల్లోపే ముగుస్తుంది. ఆయన తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ సీజేఐ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈయనకు మాత్రం రెండేళ్లు ఛాన్సు ఉంది.