దేశంలోని చట్టసభల పని తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని చట్టాలు ఎందుకు చేస్తున్నారో, వాటి ఉద్దేశ్యం ఏమిటో న్యాయస్థానాలు సైతం అర్థం చేసుకోలేని విధంగా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు. చట్టాలు చేసే క్రమంలో పార్లమెంట్‌లో వాటిపై సరైన చర్చలు జరగడం లేదని కుండబద్దలు కొట్టారు. చర్చలు జరపడంపై కంటే కూడా సభ్యులు ఆటంకాలు సృష్టించడంపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని ఆక్షేపించారు.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎన్వీ రమణ.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా చట్టాల్లో అనేక లోపాలు ఉంటున్నాయని.. కొన్నిసార్లు ఏ ప్రయోజనం కోసం, ఎవరి ప్రయోజనం కోసం వాటిని తయారు చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదని అన్నారు. తికమకపెట్టేలా ఉంటున్న అలాంటి చట్టాలతో అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో పార్లమెంటు సభ్యుల్లో చాలా మంది న్యాయవాదులు ఉండేవారని గుర్తు చేసిన సీజేఐ.. అప్పటి సభలలో చర్చలు చాలా నిర్మాణాత్మకంగా ఉండేవని చెప్పారు. తాను కొన్ని ఆర్థిక బిల్లులపై చర్చలను చూశానని.. అవి ఎంతో అర్థవంతంగా సాగి, అమలుకు నోచుకున్నాయని చెప్పారు. అలా ఒక చట్టాన్ని రూపొందించే క్రమంలో.. శాసన వ్యవస్థ తమ విధిని సంపూర్ణంగా నిర్వర్తించినట్టు అందులో కనిపించిందని చెప్పుకొచ్చారు. అలా జరిగినప్పుడు కోర్టులపై భారం కూడా తగ్గుతుందని, చట్టాల అమలు కూడా సులువు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో వాళ్లు అలా చేశారు.. కానీ ఇప్పుడు అందుకు విరుద్దమైన పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు.
మంచి న్యాయవాదులు చట్టాన్ని రూపొందించడంలో సహకరించకపోవడమే ఈ పరిణామాలకు ప్రధాన కారణమని ఎన్వీ రమణ విశ్లేసించారు. చట్టసభల ప్రక్రియల్లో న్యాయవాదులు చురుకుగా పాల్గొనాల్సిన అవసరం ఉందని సూచించారు. న్యాయవాద వృత్తిని డబ్బు సంపాదించడానికో, హాయిగా జీవించడానికో పరిమితం చేయవద్దని.. వారు తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని దేశానికి అందిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఇదిలా ఉంటే, షెడ్యూల్‌కు రెండు రోజుల ముందే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీవ్ర గందరగోళం మధ్య సాగాయి. ఉభయ సభలూ అనేక మార్లు అవాంతరాలను ఎదుర్కొన్నాయి. పెగాసస్ స్పైవేర్ ఆంశంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల పరస్పర ఆరోపణలతో సమయం అంతా వృధా అయిపోయింది. రాజ్యసభ ఈ సెషన్‌లో కేవలం 28 గంటల 21 నిమిషాల పాటు మాత్రమే జరగగా… 21 గంటల 14 నిమిషాలు మాత్రమే పనిచేసింది. ఎగువ సభలో 19 బిల్లులు, దిగువ సభలో 20 బిల్లులు ఆమోదించబడ్డాయి. ఇవన్నీ కూడా సరైన చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. ఈక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.