ట్రైబ్యునల్స్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని ఆయన నేరుగా తప్పుబట్టారు. సుప్రీంకోర్టు తీర్పులంటే కేంద్రానికి గౌరవం లేదా అని తీవ్రంగా మందలించారు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలోనే ట్రైబ్యునల్స్ కు సంబంధించిన చట్టాన్ని తాము కొట్టివేయగా… మరో చట్టం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్రాన్ని సీజేఐ ప్రశ్నించారు. ఇప్పుడు కోర్టు ముందు మూడు దారులున్నాయని… ట్రైబ్యునల్స్ ను రద్దు చేయమంటారా, కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని కొట్టివేయాలా, కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలా అని సీజేఐ సూటిగా ప్రశ్నించారు. ట్రైబ్యునల్స్ లో ఖాళీలను భర్తీ చేయటంపై కూడా కేంద్రం తీరును తప్పుబట్టిన ఆయన విచారణను వచ్చే సోమవారంకు వాయిదా వేశారు. ఈ లోపు కేంద్రం స్పష్టమైన సమాధానం చెప్పాలని సూచించారు.