న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతుండటంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన అన్నారు.
అఖిల భారత న్యాయ సేవల అథారిటీస్ సమావేశాన్ని జైపూర్ లో శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి ఆయన హాజరయ్యారు. సమావేశంలో రిజిజు లేవనెత్తిన పలు అంశాలకు ఆయన బదులిచ్చారు.
న్యాయమూర్తులుగా తాము కూడా విదేశాలకు వెళుతూ ఉంటామని ఆయన అన్నారు. ఆ సమయంలో కేసుల గురించి పలువురు అడుగుతుంటారని ఆయన చెప్పారు. ఓ కేసు పరిష్కారానికి ఎంత సమయం పడుతుందన్న ప్రశ్నను అడుగుతుంటారని ఆయన పేర్కొన్నారు. పెండింగ్ కేసులకు కారణమేంటో ప్రజలందరికీ తెలుసన్నారు.
జ్యుడిషియల్ వ్యవస్థలో ఖాళీల భర్తీ చేపట్టకపోవడం, న్యాయవ్యవస్థలో మౌలిక వసతులను కల్పించకపోవడం వల్లే పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని చెప్పారు. గతంలో ఇదే విషయాన్ని తాను ప్రధాన న్యాయమూర్తుల, ముఖ్యమంత్రుల సమావేశాల్లోనే చెప్పానని ఆయన పేర్కొన్నారు.