విద్యార్థులు హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరయ్యేలా కర్ణాటకలోని ప్రభుత్వ సంస్థలను ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై తక్షణమే విచారణ జరిపేలా జాబితా చేయాలంటూ చేసిన అభ్యర్థనను సీజేఐ డీవై చంద్రచూడ్ తిరస్కరించారు.
హోలీ సెలవుల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్ల విచారణ కోసం ఓ బెంచ్ ను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. సుప్రీం కోర్టుకు ఈ నెల 6 నుంచి హోలీ సెలవులు ఉన్నాయి. మళ్లీ ఈ నెల 13 నుంచి న్యాయస్థానం పున: ప్రారంభం కానుంది.
పరీక్షలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నట్టు పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. అందువల్ల పిటిషన్లపై అత్యవసరంగా ఈ రోజు విచారణ జరపాలని న్యాయవాది కోరారు. దీన్ని సీజేఐ తిరస్కరించారు. చివరి రోజున వస్తే తానేమి చేయగలనని ఆయన ప్రశ్నించారు.
ఈ పిటిషన్లపై ఓ బెంచ్ ను తాను ఏర్పాటు చేస్తానని సీజేఐ చెప్పారు. దాన్ని విచారణ పిటిషన్ల జాబితాలో చేరుస్తానని తెలిపారు. మరి పరీక్షల పరిస్థితి ఏంటని న్యాయవాది సీజేఐని అడిగారు. దీంతో మీ ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేనని సీజేఐ అన్నారు.