మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఫైట్ సీక్వెన్స్ తో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అటు షూటింగ్ అలా మొదలైందో లేదో ఇలా బిజినెస్ పై వదంతులు పుట్టుకొచ్చాయి.
మహేష్ సినిమాకు శాటిలైట్ + డిజిటల్ వంద కోట్ల రూపాయలు చెబుతున్నారట. ఈ సినిమా ఆడియో హక్కులకే పాతిక కోట్లు అడుగుతున్నారట. హిందీ డబ్బింగ్ కోసం 50 కోట్లు కోట్ చేస్తున్నారట. ఇలా ప్రీ-రిలీజ్ బిజినెస్ పై చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి. వీటిపై నిర్మాత నాగవంశీ స్పందించాడు.
“మహేష్ మూవీపై ఇప్పటివరకు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయలేదు. పూర్తిగా ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన తర్వాత మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతం మార్కెట్లో వినిపిస్తున్న నెంబర్లలో వాస్తవం లేదు. అయినా మహేష్ తో మేం పాన్ ఇండియా సినిమా తీయడం లేదు. తెలుగు సినిమా తీస్తున్నాం. తెలుగు సినిమాకు వంద కోట్లు ఎవరిస్తారు?”
ఇలా మహేష్-త్రివిక్రమ్ సినిమా బిజినెస్ పై వస్తున్న వార్తలను ఖండించాడు నాగవంశీ. ఈ సినిమాలో ఐటెంసాంగ్ కోసం ప్రయత్నిస్తున్నామని, మలయాళ హీరో పృధ్వీరాజ్ కోసం కూడా ప్రయత్నిస్తున్నామని తెలిపిన నాగవంశీ.. అవి కూడా ఇంకా కొలిక్కి రాలేదని తెలిపాడు.