ఏపీ ప్రభుత్వంలో ఆధిపత్య పోరు నడుస్తుందా…? జోడెద్దులా ఉండాల్సిన ఇద్దరు ఉన్నతాధికారులు ఇప్పుడు సీఎం జగన్‌కు కొత్త తలనొప్పులు తెస్తున్నారా…? అసలే అనుభవలేమితో నెట్టుకొస్తున్న జగన్‌కు ఈ వ్యవహరం అసహనానికి గురిచేస్తుందా…? ఎవరా ఇద్దరు అధికారులు…? ఎంటా కథా…?
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో ముఖ్య కార్యదర్శి… ఈ ఇద్దరు సీఎంకు రెండు కళ్లలాంటి వారు. ఈ ఇద్దరు అధికారుల పనితీరుపైనే సీఎం, ఆయన కార్యాలయం ప్రధానంగా ఆధారపడుతుంది. అలాంటిది ఈ ఇద్దరి నేతల మధ్యే విభేదాలు తారాస్థాయికి చేరితే… ప్రస్తుతం అదే జరుగుతోంది ఏపీ సీఎంవోలో. ఈ గొడవ ఎంతవరకు వెళ్లిందంటే… సీఎస్ ఆగ్రహంతో సీఎంవో ముఖ్యకార్యదర్శికి మెమో కూడా ఇచ్చేశారు.
ఇటీవల క్యాబినెట్‌కు ముందు వైఎస్‌ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్‌కు సంబంధించిన ఓ ఫైల్ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంకు చేరింది. దీన్ని ఆయన ఫైనాన్స్ అనుమతితో రీ సర్క్యులేట్ చేయమని ఆదేశించారు. కానీ జీఏడీ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా చూస్తున్న ప్రవీణ్ ప్రకాష్ అవేవీ పట్టించుకోకుండా… సీఎం అనుమతి లేకుండానే క్యాబినెట్ ముందు ఫైల్ పెట్టారు. మరో ఫైల్‌లోనూ ఇదే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. గ్రామ న్యాయాలయాల ఫైల్ క్యాబినెట్ ముందు పెట్టాలని సంబంధిత శాఖ కార్యదర్శి సీఎం పర్మిషన్ కూడా తీసుకున్నా… ప్రవీణ్ ప్రకాష్ ఆ ఫైల్ తన దగ్గరే పెట్టుకొని, క్యాబినెట్ ముందుకు తెలేదు. దాంతో సీఎస్ ఆగ్రహంతో ప్రవీణ్ ప్రకాష్‌కు మెమో జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
దురుద్దేశపూర్వకంగానే… సీఎంవో ముఖ్యకార్యదర్శి ఇలా వ్యవహరిస్తున్నారని ప్రచారం ఊపందుకుంది. ఇటీవలే ఓ అధికారి నేను ప్రవీణ్ ప్రకాష్ దగ్గర పనిచేయలేనని, నన్ను ఇతర శాఖకు బదిలీ చేయాలని సీఎస్‌కు లేఖ కూడా రాశారని సచివాలయ వర్గాల సమాచారం. దీంతో సచివాలయంలో ఏ ఇద్దరు ఉన్నతాధికారులు ఎదురుపడ్డా ఈ వ్యవహరమే చర్చిస్తున్నారు.
అసలే… ప్రతిపక్షాల ఆరోపణలు, పాలనలో ఇబ్బందులతో సతమతమవుతున్న సీఎం జగన్ ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.