జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో విగ్రహ ఆవిష్కరణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కొత్త దామరాజు పల్లిలో శివాజీ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, బీజేపీ నాయకులు జేఎన్ వెంకట్ హాజరయ్యారు.
బీజేపీ నేత వెంకట్ ను వేదికపైకి పిలవడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుల్ని పిలిచి తమ పార్టీ సర్పంచ్, ఎంపీటీసీలను సభకు పిలవకుండా అవమానిస్తున్నారని నిర్వాహకులపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరుపార్టీల కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు.
దీంతో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సభలో పాల్గొనకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.