టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పంచాయితీ ఇప్పుడు తారా స్థాయికి చేరింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో పంచాయితీ అధిష్టానం వద్దకు చేరింది.
అలంపూర్‌లో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఇసుకదందాకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అబ్రహం సంచలన ఆరోపణలు చేశారు. అలంపూర్‌లో పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని… దళితుడును కాబట్టే తనను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రకటించటం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తన వారికే టికెట్ ఇవ్వాలని లేదంటే… ఇండిపెండేంట్‌లను రంగంలోకి దించి… ఓడిస్తానంటూ బెదిరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని జిల్లా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు.
తన నియోజవకర్గంలో చేతులు పెడితే ఊరుకునేది లేదు ఖబడ్ధార్ అంటూ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ను హెచ్చరించారు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం.
కొంతకాలంగా ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య అంతర్గతపోరు నడుస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఎమ్మెల్యే అబ్రహం ఆరోపణలపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ స్పందించాల్సి ఉంది.
కృష్ణమోహన్ మాజీ మంత్రి డీకే అరుణపై పోటీ చేసి గెలుపొందగా, అబ్రహం కాంగ్రెస్ నేత సంపత్‌ను ఓడించారు.